మనసిక సంఘర్షణ మనుష్యులు ఏవో సమస్యలతో , భయాలతో , తమను అర్థం చేసుకునే ఆప్తులు కరువై బాధ పడుతుంటారు. ఇది నా బాధ అని చెప్పుకోవడానికి వారికి...
![]() |
| మనసిక సంఘర్షణ |
మనుష్యులు ఏవో సమస్యలతో, భయాలతో, తమను అర్థం చేసుకునే ఆప్తులు కరువై బాధ పడుతుంటారు. ఇది నా బాధ అని చెప్పుకోవడానికి వారికి ఎవరూ ఉండరు. ఎవరికైనా చెప్పు కుందామన్నా, వారు ఉచిత సలహాలతో మరింత బాధపెడతారు.
మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు సాధారణంగా ఈ కింది విధంగా ఉంటాయి. వీటిలో స్వయంకృతాపరాధాలు కొన్నైతే, ఎవరో తమ నెత్తిన రుద్దినవి మరికొన్ని. వీటిని ఈ కింద పేర్కొనడం జరిగింది.
బంధాలు : కృతఘ్నతతో కూడిన బంధుత్వాలు, కుటుంబ కలహాలు, ఏరుదాటి తెప్ప తగలేసే విధంగా ఉండే స్వార్థం, కక్షలు మొదలైనవి.
పని వత్తిడి : ఆఫీస్లో దైనందిన సమస్యలు, గుర్తింపు లేకపోవడం, టెన్షన్, స్ట్రెస్
అగమ్యగోచర స్థితి : ఏం చేయాలో పాలుపోని సందిగ్ధస్థితి, నిరుద్యోగం, రుణబాధలు మొదలైనవి.
తల్లిదండ్రులు-బిడ్డలు: మారుతున్న విలువలు, తరాల మధ్య అంతరాలు తదితర పలు కారణాలతో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విపరీతంగా పెరుగుతున్న దూరం
వివాహాలు : వివాహంతో ముడిపడిన సమస్యలనేకం. వీటిలో వివాహానికి ముందు ఉండేవి కొన్ని, తరువాత వచ్చేవి మరికొన్ని. వివాహం తరువాత దంపతుల మధ్య అవగాహనాలేమి, దాంపత్య సౌఖ్యం కరవు కావడం, ప్రతినిత్యం ఏదో ఒక రకమైన దెబ్బలాట, రాద్ధాంతాలు, పట్టింపులు మొదలైనవి.
ఎదిగే పిల్లలు : పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండకుండా ప్రవర్తించడం, ఇంటివద్ద, స్కూల్లో, సాటి పిల్లలతో, తల్లిదండ్రులతో, టీచర్లతో మెలిగే తీరు తెన్నులు మొదలైనవి.
వితండ ధోరణులు : దురహంకారం, కలిసి మెలిసి ఉండని ప్రవర్తన, కరువైన ఆప్యాయత, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు మొదలైనవి.
వృద్ధాప్యం : వృద్ధాప్యంలో ఒంటరితనం, తమ గోడు వినేవారి కోసం వెదుకులాటలు మొదలైనవి. మనస్సుతో ముడిపడి ఉన్న జీవితాలు కావడంతో పైజాబితాకు అంతం ఉండదు. మనస్సు సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెడుతుంది. దీనితో శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యాన్ని ఇలా నిర్వచించింది 'పరిపూర్ణమైన శారీరక, మానసిక, సామాజిక సౌఖ్యమే ఆరోగ్యం కానీ, వ్యాధి లేకపోవడం కాదు' అని.
మనసు స్వరూపము
మనసుకు రూపం లేదు. చిత్తవృత్తి, తెలివి, బుద్ధి, అహంకారం-ఇవన్నీ కలిసి అంతః కరణ లేదా మనస్సు అవుతాయి. ఇవి మనిషిని అనేక భ్రమలకు లోనుచేసి తీవ్రమైన అశాంతికి గురి చేస్తాయి. అన్ని బాధలకు, శారీరకమైన అనారోగ్యాలకు మనసు కారణం. మనసును స్వాధీనంలో పెట్టుకోవడం ద్వారా అనేక రుగ్మ తలనుంచి బైట పడవచ్చు. మన సంతోషాలు, బాధలు అన్నీ మనసుతో ముడిపడి ఉన్నాయి కనుక దీని గురించిన విచారణ చేయాలి. ఏమిటి ఆ అవసరమంటే - ఏ మనసు అశాంతి కలిగిస్తున్నదో, దానికి శాంతి కావాలి. పాంచభౌతికమైన మానవ శరీరం నిలవడానికి, మనుగడ సాగించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో, మనశ్శాంతి కూడా అంతే ముఖ్యం. దీనికోసం సాటివారిని ఆదరించడం, గౌరవించడం నేర్చుకోవాలి. హింసాప్రవృత్తిని విడనాడాలి. దృక్పథంలో, పద్ధతులు, వైఖరిలో మార్పులు రావాలి. మనశ్శాంతి ఆవశ్యకతను గుర్తించి కూడా మనుష్యులు దౌష్ట్యాలనుంచి బైటపడలేక లోలోపలే బాధపడుతున్నారు. ఈ బాధలు ఎవరి దగ్గరైనా చెప్పుకుంటే హాస్యా స్పదంగా పరిణమించడమే కాకుండా, కొత్త అవ మానాలకు గురి కావలసి వస్తుంది. పసి తనంలో అయితే తల్లితో బాధలు చెప్పుకుంటాం. కాని వయస్సు పెరిగిన తరువాత బాధను అర్థం చేసుకోగలిగే ఆత్మీయుడు అవసరమవుతాడు.
ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ తరుణోపాయంగా కనిపిస్తోంది. కౌన్సెలింగ్ లో సమస్యలను పరిష్కరించుకునేలా ధైర్యం చెబుతారు. మానసిక దారుఢ్యాన్ని తీర్చిదిద్దుతారు. రోగి సమస్యను సమగ్రంగా విశ్లేషించి, దానికి తగిన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు

COMMENTS